Srisailam | శ్రీశైలంలో లోక కల్యాణం కోసం శుక్రవారం సాయంత్రం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ఊయల సేవ నిర్వహించినట్లు దేవస్థానం ఈఓ డీ పెద్దిరాజు తెలిపారు. ప్రతి శుక్రవారం, పౌర్ణమి, మూలా నక్షత్రం రోజుల్లో స్వామి అమ్మవార్లకు ఈ ఊయల సేవ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చక స్వాములు సేవా సంకల్పం పఠించారు. తర్వాత కార్యక్రమం నిర్విఘ్నంగా సాగాలని మహాగణపతి పూజ జరిపించారు. అనంతరం ఊయలలో వేంచేబు చేయించిన స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజ జరిపించారు. చివరిగా స్వామి అమ్మవార్లకు ఊయల సేవ నిర్వహించారు. ఊయల సేవ కోసం స్వామి అమ్మవార్లకు విశేషంగా పుష్పాలంకరణ, పుష్పార్చనలు జరిపించారు. పుష్పాలంకరణ కోసం పలు పుష్పాలు వినియోగించారు.
శ్రీశైలంలో లోక కల్యాణం కోసం శ్రీశైల క్షేత్ర గ్రామ దేవత అంకాళమ్మ వారికి శుక్రవారం ఉదయం అభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. ప్రతి శుక్రవారం అంకాళమ్మ వారికి దేవస్థానం (సర్కారీ) సేవగా ఈ విశేష పూజ నిర్వహిస్తున్నారు. శ్రీ అంకాళమ్మ వారికి అభిషేకం, విశేషార్చనలు, పుష్పాలంకరణ, కుంకుమార్చన జరిపించారు. శ్రీశైల క్షేత్రానికి గ్రామ దేవతగా చెబుతున్న అంకాళమ్మ ఆలయం ప్రధాన ఆలయానికి ఎదురుగా గల రహదారి చివరిలో కుడివైపున ఉత్తర ముఖంగా ఉంది.
ప్రకృతి శక్తుల కళలే గ్రామ దేవతలని దేవీ భాగవతం చెబుతోంది. ఈ ప్రకృతి అంతా ఆది పరాశక్తి స్వరూపమేనని అర్ష వాజ్ఞ్మయం చెబుతున్నది. దైవశక్తి సమాజంలో ఏదో కొన్ని వర్గాలకు పరిమితం కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉందని తెలియజెప్పే మన విశిష్ట సంస్కృతి ఉదాత్త వైఖరికి తార్కాణంగా ఈ గ్రామ దేవత ఆరాధనను పేర్కొనవచ్చు.
చతుర్బుజాలు గల ఈ దేవి నాలుగు చేతుల్లో కుడి వైపు క్రింద నుంచి పైకి వరుసగా కత్తి సర్పంలో చుట్టబడిన ఢమరుకం, ఎడమవైపు పానపాత్ర, త్రిశూలం ఉంటాయి. కిరీట ముకుటం గల ఈ దేవి వస్త్రాలంకురాలై కర్ణాభరణాలను, కంఠాభరణాలను కలిగి ఉంటుంది. ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగేందుకు ముందుగా మహా గణపతి పూజ నిర్వహించారు. తదుపరి లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చక స్వాములు సంకల్పం పఠించారు. అనంతరం పంచామృత అభిషేకం, హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, పుష్పోదకం, విశేషాభిషేక అర్చన నిర్వహించారు.