Sasikala Narra | అమెరికాలో ఎనిమిదేళ్ల క్రితం ఏపీకి చెందిన తల్లీకొడుకులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ చావులకు ఆమె భర్తనే కారణమని పోలీసులు భావించారు. కానీ అతను కాదని తెలియడంతో అసలు నిందితుడి కోసం దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత అసలు నిందితుడు ఎవరో తెలుసుకున్నారు. అది కూడా అతను వాడిన ల్యాప్‌టాప్ నుంచి సేకరించిన డీఎన్ఏ ద్వారా! మరి ఆ కేసు ఏంటి? అసలు దోషిని ఎలా పట్టుకున్నారంటే..
వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని ప్రకాశం జిల్లా పర్చూర్ మండలం తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన నర్రా హనుమంతరావు తన భార్య శశికళ (40), కొడుకు అనీశ్ సాయి (7)తో కలిసి అమెరికాలోని న్యూజెర్సీలో సెటిల్ అయ్యాడు. 2017 మార్చి 23వ తేదీన హనుమంతరావు ఆఫీసు నుంచి తిరిగి తాను ఉంటున్న మాపుల్ షేడ్‌లోని అపార్ట్‌మెంట్‌కు వచ్చాడు. ఆ సమయంలో తన భార్య, కొడుకు ఇద్దరూ రక్తపు మడుగులో కనిపించారు. దీంతో అతను వెంటనే అమెరికా పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వీరి మరణాలకు నర్రా హనుమంతరావే కారణమని తొలుత అనుమానించారు. హనుమంతరావుకు ఒక కేరళ మహిళతో వివాహేతర సంబంధం ఉందని.. అందుకే భార్యబిడ్డలను హతమార్చి ఉంటాడని ఆరోపణలు రావడంతో అతన్ని అరెస్టు చేశారు. దర్యాప్తులో భాగంగా ఘటనాస్థలంలో లభించిన డీఎన్ఏతో హనుమంతరావు డీఎన్ఏ సరిపోలేదు. దీంతో అతన్ని నిర్దోషిగా విడుదల చేశారు.
అసలు నేరస్తుడు ఎవరై ఉంటారనే కోణంలో న్యూజెర్సీ పోలీసులు మళ్లీ విచారణ మొదలుపెట్టారు. ఈ క్రమంలో సహోద్యోగి హమీద్‌తో హనుమంతరావుకు గొడవలు ఉన్నట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు. అతని డీఎన్ఏను కూడా టెస్ట్ చేసి అనుమానాన్ని క్లియర్ చేసుకోవాలని అనుకున్నారు. కానీ శశికళ హత్య జరిగిన ఆరు నెలలకు హమీద్ ఇండియాకు వెళ్లిపోయాడని విచారనలో తెలుసుకున్నారు. అయినప్పటికీ భారత్‌లో ఉన్న హమీద్‌ను సంప్రదించి, అతని డీఎన్ఏ ఇవ్వాలని పలుమార్లు కోరారు. అందుకు హమీద్ ఒప్పుకోలేదు. దీంతో కేసును ఎలా పరిష్కరించాలో తెలియక కొద్దిరోజులు తలలు పట్టుకున్నారు. ఆ తర్వాత హమీద్ డీఎన్ఏను అతను వాడిన కంప్యూటర్ ద్వారా తీసుకోవచ్చని పోలీసులు భావించారు. ఈ క్రమంలోనే అతను వాడిన ల్యాప్‌టాప్‌ను తమకు పంపించాలని కాగ్నిజెంట్ కంపెనీకి అమెరికా కోర్టు 2024లో ఉత్తర్వులు జారీ చేసింది. అలా ల్యాప్‌టాప్ దొరకడంతో దాని నుంచి సేకరించిన డీఎన్ఏను, మర్డర్ జరిగిన ప్లేస్‌లో దొరికిన డీఎన్‌తో పోల్చగా సరిపోయింది. దీంతో హమీద్‌నే అసలు హంతకుడు అని పోలీసులు తేల్చారు. ఈ మేరకు ప్రకటన కూడా విడుదల చేశారు. ప్రస్తుతం హమీద్ ఇండియాలో ఉండటంతో అతన్ని తిరిగి అమెరికాకు అప్పగించాలని అక్కడి అధికారులు భారత విదేశాంగ శాఖను కోరారు. అతని ఆచూకీ తెలిసిన వారు తమకు తెలియజేయాలని సూచించారు.