Love | ఇన్‌స్టా వేదికగా మొదలైన వారి పరిచయం.. పరిణయం దాకా తీసుకువచ్చింది. అదేదో వారిది ఒకే ప్రాంతం కూడా కాదు. ఆమెది అమెరికా అయితే.. అతనిది ఆంధ్రప్రదేశ్. అతని గుండెల్లో స్థానం సంపాదించుకున్న ఆ అమెరికా అమ్మాయి.. తన ప్రియుడిని ప్రత్యక్షంగా కలవాలనే ఉద్దేశంతో గాలిలో విహరిస్తూ వేల మైళ్లు ప్రయాణించి ఆంధ్రప్రదేశ్‌లో వాలిపోయింది. ఇక ఆంధ్రా కుర్రాడు, అమెరికా అమ్మాయి కలిసి తమకు నచ్చిన ప్రాంతాల్లో పర్యటిస్తూ.. మరింత గాఢంగా ప్రేమించుకున్నారు. త్వరలోనే తన ప్రియుడిని తీసుకొని అమెరికా వెళ్లనుంది ప్రియురాలు.
అమెరికాకు చెందిన జాక్లిన్ పొరెరోకు ఏపీలోని ఓ కుగ్రామానికి చెందిన చందన్ పరిచయం అయ్యాడు. వీరిద్దరి మధ్య ప్రేమకథా హాయ్‌తో ఆరంభమైంది. ఆ తర్వాత ఒకరికొకరు తమ భావాలను పంచుకున్నారు. అలా 14 నెలల పాటు ప్రేమలో మునిగి తేలారు. ఇప్పుడు ఇద్దరు ఏకం కావాలనుకుంటున్నారు. తమ జీవితాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలనుకుంటున్నారు.
అయితే చందన్‌కు తానే మొదట మేసేజ్ చేశానని జాక్లిన్ చెప్పుకొచ్చారు. చందన్‌లో ఒక ఉద్వేగమైన క్రైస్తవుడిని చూశాను. ఆ తర్వాత అతన్ని ప్రేమించాలనుకున్నాను. ఇక 8 నెలల ఆన్లైన్ డేటింగ్ తర్వాత.. చందన్‌ను పెళ్లి చేసుకుంటానని ఇంట్లో అమ్మకు చెప్పాను. ఆమె కూడా తమ ప్రేమ పెళ్లికి అంగీకరించడంతో.. లైఫ్ పార్ట్నర్ చందన్‌ను కలిసేందుకు ఇండియాకు వచ్చానని జాక్లిన్ తెలిపారు. ఇక చందన్ కంటే ఆమె 9 సంవత్సరాలు పెద్దది. అయినా కూడా ప్రేమ వారిని మరింత దగ్గరకు చేర్చింది. ఇక చందన్ వీసా కోసం దరఖాస్తు చేశారు. త్వరలోనే అమెరికాలో అడుగుపెట్టి కొత్త జీవితానికి నాంది పలుకబోతున్నారు జాక్లిన్ అండ్ చందన్.