Srisailam | శ్రీశైలంలో శ్రీభ్రమరాంబికా దేవి మల్లికార్జున స్వామిఅమ్మవార్లను ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక ఎగుమతి ప్రోత్సాహక వ్యవహారాల శాఖ మంత్రి నందగోపాల్ గుప్తా దర్శించుకున్నారు. సోమవారం ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న మంత్రి నంద గోపాల్ గుప్తాకు అర్చక వేదపండితులు తిలకధారణ చేశారు.
శ్రీశైలం ఈవో పెద్దిరాజుతో పాటు ఏఈవోలు మోహన్, హరిదాస్, అధికారులు పూలమాలతో మంత్రి నంద గోపాల్ గుప్తాకు స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీర్వచన మండపంలో వేదాశీర్వచనం చేసి తీర్ధప్రసాదాలు, శేషవస్త్రం, ఙ్ఞాపికను అందజేశారు.
శ్రీశైలం ప్రాజెక్ట్ కాలనీలో దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సిబ్బంది వసతి గృహాల నిర్మాణ పనులను దేవస్థానం ఈఓ పెద్దిరాజు సోమవారం ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఆయనతోపాటు ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు కూడా ఉన్నారు. దేవస్థానం సిబ్బంది కోసం శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలో స్టాఫ్ క్వార్టర్లు నిర్మిస్తున్నారు.
మొత్తం మూడు నమూనాల్లో 1-బీహెచ్కే స్మాల్, 1-బీహెచ్కే బిగ్, 2-బీహెచ్కే బిగ్ పేర్లతో దేవస్థానం ఈ వసతి గృహాలను నిర్మిస్తున్నది. సిబ్బంది కోసం మొత్తం 297 వసతి గృహాలు నిర్మిస్తున్నది దేవస్థానం. వసతి గృహాల నిర్మాణ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
అదే సమయంలో వసతి గృహాల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని ఈవో పెద్దిరాజు స్పష్టం చేశారు. ఏ చిన్న పనిలో కూడా నాణ్యతలో రాజీ పడవద్దని అధికారులకు సూచించారు. ఈ వసతి గృహాల నిర్మాణం పూర్తయిన తర్వాత దేవస్థానం సిబ్బందిని సున్నిపెంటకు తరలిస్తారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.