AP News | ఏపీలోని అనంతపురం జిల్లాలో వాటర్ ట్యాంక్లో పురుగుల మందు కలపడం కలకలం రేపింది. కనేకల్ మండలం తుంబిగనూరులో వాటర్ ట్యాంక్లో కొంతమంది దుండుగులు పురుగుల మందు కలిపారు. అయితే శనివారం ఉదయం నీటిని సరఫరా చేయడానికి ముందే ఈ విషయాన్ని గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది.
వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం అర్ధరాత్రి తుంబిగనూరులోని తాగునీటి శుద్ధ జల ట్యాంక్ సమీపంలో గ్రామస్థులకు ఇద్దరు దుండగులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో అనుమానం వచ్చిన గ్రామస్థులు వాటర్ ట్యాంక్ వద్దకు వెళ్లి పరిశీలించారు. అక్కడ వాసన రావడంతో పాటు దగ్గరలో పురుగుల మందు డబ్బా కనిపించింది. దీంతో వాటర్ ట్యాంక్లో రసాయనాలు కలిపినట్లుగా గ్రామస్థులు నిర్ధారించుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఈ దుశ్చర్యతో తుంబిగనూరు గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వాళ్ల కుట్రను ముందుగానే గుర్తించాం కాబట్టి పెను ప్రమాదం తప్పింది.. అదే ట్యాంక్లో నీళ్లు తాగి ఉంటే పరిస్థితేంటని భయాందోళనలకు గురయ్యారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఓడిపోయామనే అక్కసుతో స్థానిక వైసీపీ నాయకులు ఈ కుట్ర చేసి ఉంటారని పలువురు ఆరోపించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.