Shivraj singh Chouhan | ఏపీలోని గుంటూరు జిల్లాలో పర్యటించిన కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లో ప్రజలు నన్ను మామ అని పిలుస్తారు.. ఇకపై ఏపీ వారికి కూడా నేను మామనే అని వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా వెంగళాయపాలెం చెరువు వద్ద వాటర్ షెడ్ పథకం కింద రూ.1.20 కోట్లతో చేపట్టిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మొక్కలు నాటారు. బావిలో నుంచి స్వయంగా నీళ్లు తోడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలయిక అద్భుతమని కొనియాడారు. ఈ ముగ్గురూ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు.
వెంగళాయపాలెం చెరువు పునరుద్ధరణ చూశాక చాలా సంతోషం వేసిందని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. పురాతన చెరువును అత్యాధునికంగా తీర్చిదిద్దారని తెలిపారు. దీనిద్వారా ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పారు. పశువులకు తాగునీరు లభిస్తుందని అన్నారు. మత్స్య సంపద పెంచడానికి, బోటింగ్ సౌకర్యానికి చెరువును ఉపయోగించవచ్చన్నారు. వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, ఓపెన్ థియేటర్ వంటివి ప్రజలకు ఆనందాన్ని ఆరోగ్యాన్ని పంచుతాయని చెప్పారు. దేశవ్యాప్తంగా ఇదే తరహాలో చెరువుల పునరుద్ధరణ చేస్తానని మాటిచ్చారు.
కేంద్రమంత్రి హోదా కంటే కూడా ప్రజలకు సేవ చేయడం కోసమే ఆంధ్రాకు వచ్చానని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రజా సేవను దైవ పూజగా భావిస్తానని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో నన్ను మామ అని అంటారని.. ఇకపై ఏపీ ప్రజలకు కూడా నేను మామనే అని వ్యాఖ్యానించారు.