JP Nadda | వైసీపీ హయాంలో అవినీతి రాజ్యమేలిందని కేంద్రమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. విశాఖలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవన్ చేపట్టిన సారథ్యం యాత్ర ముగింపు సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గత వైసీపీ ప్రభుత్వం.. అవినీతి, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు అవలంబించిందని అన్నారు. వైసీపీ అవినీతి పాలనకు కూటమి చరమగీతం పాడిందని చెప్పుకొచ్చారు.
ఎన్డీయే పాలనలో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుందని జేపీ నడ్డా తెలిపారు. రాష్ట్రంలో జాతీయ రహదారులు అభివృద్ధి చేశామని.. విశాఖ, కాకినాడ, తిరుపతి స్మార్ట్ సిటీలుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. సాగర్మాల పేరుతో 14 పోర్టులు నిర్మిస్తున్నామని చెప్పారు. పది కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు ఏర్పాటు చేశామని తెలిపారు. 2014కి ముందు దేశంలో అసమర్థ, వారసత్వ రాజకీయాలు నడిచేవని అన్నారు. అప్పట్లో దేశంలో అవినీతి రాజ్యమేలిందని తెలిపారు. 2014కు ముందు ప్రజలను మభ్య పెట్టేందుకు మేనిఫెస్టో తీసుకొచ్చి ఎన్నికలయ్యాక మరిచిపోయేవారని తెలిపారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోయిందని అన్నారు. ఆ పార్టీ అవినీతి పాలనకు చంద్రబాబు, మోదీ చరమగీతం పాడారని తెలిపారు. ఇప్పుడు మోదీ పాలనలో దేశం అభివృద్ధి పథంలో నడుస్తోందని అన్నారు.