న్యూఢిల్లీ: రాష్ట్రాల విభజన సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు తగిన మార్గదర్శకాలు జారీ చేయాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సుప్రీంకోర్టులో సవరణ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ గతంలో దాఖలు చేసిన పిటిషన్‌కు జతగా ఈ సవరణ పిటిషన్‌ను ఉండవల్లి తరఫు న్యాయవాది దాఖలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టులో ఉండవల్లి అరుణ్‌కుమార్ గతంలో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. విభజన తర్వాత ఏపీకి ఎలాంటి ప్రయోజనాలు చేకూరలేదని గత పిటిషన్లో ఉండవల్లి పేర్కొన్నారు. అయితే ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో భవిష్యత్‌లో రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధమని కోర్టు తేల్చినా.. వాస్తవ రూపం దాల్చే అవకాశాలు లేకపోవడంతో ఉండవల్లి ఈ సవరణ పిటిషన్ దాఖలు చేశారు.
రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధమని తేలితే ఆ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయాలని.. భవిష్యత్‌లో మరో రాష్ట్రాన్ని విభజించేటప్పుడు ఇలాంటి ఇబ్బందులు రాకుండా పాటించేందుకు కేంద్రానికి తగిన మార్గదర్శకాలు ఇవ్వాలంటూ ఉండవల్లి కోరారు. విభజన తర్వాత పూర్తిగా నష్టపోయిన ఏపీకి కేంద్రం మద్దతిచ్చేలా తగిన ఆదేశాలివ్వాలని తన పిటిషన్లో అభ్యర్థించారు.