అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితిపై కాగ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. రాజ్యాంగానికి విరుద్ధంగా ఆర్థిక వ్యవహారాలు కొనసాగిస్తుందని జగన్ సర్కార్ను తప్పుపటింది. శుక్రవారం 2019-20 సంవత్సరానికి గాను కాగ్ నివేదికను ఏపీ ప్రభుత్వానికి అందజేసింది. నిబంధనలకు వ్యతిరేకంగా ఆర్థిక వ్యవహారాలు చేపడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేసింది. గత ఐదేళ్లుగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా మార్పు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది.
2019-20లో 3.17 శాతం రెవెన్యూ రాబడి తగ్గిందని , వివిధ పథకాలతో 6.93శాతం రెవెన్యూ ఖర్చులు పెరిగాయని, 32,373 కోట్ల మేరబకాయిలు పెరిగాయని స్పష్టం చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అనుబంధ పద్దులను ఖర్చు చేసి… తరువాత జూన్ 2020లో శాసన సభలో ప్రవేశ పెట్టారని.. ఇది రాజ్యాంగ విరుద్ధమని కాగ్ అభిప్రాయపడింది. బడ్జెట్ మీద అదుపును ప్రభుత్వం బలహీనపరిచిందని, ప్రజా వనరుల వినియోగ నిర్వహణలో ఆర్థిక క్రమ శిక్షణ రాహిత్యాన్ని ప్రోత్సహించిందని తీవ్రంగా వ్యాఖ్యనించింది.