Ugadi Celebrations | శ్రీశైలం : భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రమైన శ్రీశైలంలో ఈ నెల 27 నుంచి 31 వరకు ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఉత్సవాల ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఉగాదికి కర్నాటకతో పాటు మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారన్నారు. ఈ మేరకు వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ.. ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉత్సవాలు 27న మొదలైనా.. వారం రోజుల ముందు నుంచే క్షేత్రానికి భక్తులు తరలివచే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలో మార్చి 20 వరకు ఏర్పాట్లన్నీ పూర్తి కావాలని చెప్పారు. మార్చి ఒకటిన నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు అన్ని విభాగాలు కార్యాచరణ ప్రణాళిక మేరకు ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. స్వామి అమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ ఎలాంటి లోటుపాట్లు లేకుండా పరిపూర్ణంగా నిర్వహించాలని వైదిక సిబ్బందికి సూచించారు.
ఉత్సవ పూజాధికాలన్నీ సమయానికే ప్రారంభించాలన్నారు. దర్శనానంతరం భక్తులకు దాదాపు 12 లక్షల లడ్డూ ప్రసాదాలను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగాన్ని ఆదేశించారు. ఉత్సవాలకు కాలిబాట మార్గంలో అనగా వెంకటాపురం, నాగలూటి, దామెర్లకుంట్ల, పెద్దచెరువు, మఠంబావి, భీమునికొలను, కైలాసద్వారం మీదుగా క్షేత్రానికి వస్తారని.. ఈ మేరకు ఆయా మార్గాల్లో కావున కాలిబాట మార్గంలో తగిన సదుపాయాలను కల్పించాలని సంబంధిత విభాగాలను ఆదేశించారు. అటవీశాఖ అధికారుల సమన్వయంతో ఆయా ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా కాలిబాటలో భక్తులకు మంచినీటిని అందించడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని చెప్పారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఏర్పాటు చేసినట్లుగానే కైలాసద్వారం వద్ద అదనపు మంచినీటి ట్యాంకులను ఏర్పాటు చేయాలన్నారు. సాక్షిగణపతి, హఠకేశ్వరం, శిఖరేశ్వరం, కైలాద్వారంతో పాటు క్షేత్రంలో భక్తులు బసచేసే పలు ప్రదేశాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు.
కాలిబాట మార్గంలోని నాగలూటి, పెచ్చెర్వు, కైలాసద్వారం మొదలైన చోట్ల.. శ్రీశైలక్షేత్ర పరిధిలో పలుచోట్ల భక్తులకు అన్నదానం చేసే దాతలకు దేవస్థానం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు. క్యూలైన్లలో వేచివున్న భక్తులకు నిరంతర మంచినీరు, అల్పాహారాన్ని అందజేసే ఏర్పాట్లు చేయాలని అన్నదాన, ఆలయ, క్యూలైన్ల నిర్వహణ విభాగాలను ఈవో ఆదేశించారు. ఎండతాకిడి అధికంగా ఉన్నందున క్యూకాంప్లెక్స్, క్యూలైన్లలో అవసరమైనచోట్ల కూలర్స్‌ను ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. ఉగాది మహోత్సవాల్లో కూడా పలు చోట్ల షామియానాలు, పైపె పెండాల్స్ చలువ పందిర్లు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని క్షేత్రపరిధిలోని పలు ఆరుబయలు ప్రదేశాలలో లైటింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. దేవస్థానం అతిథిగృహాల ప్రాంగణం, ఉద్యానవనాలు, తాత్కాలిక వసతి ప్రదేశాలు మొదలైన చోట్ల వీలైనంత ఎక్కువ విస్తీర్ణంలో ఈ తాత్కాలిక లైటింగ్‌ని ఏర్పాఉట చేయాలని ఇంజినీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. పారిశుధ్యంపై దృష్టి పెట్టాలన్నారు.
ఎప్పటికప్పుడు చెత్తచెదారాలను తొలగించేందుకు అవసరమైన సంఖ్యలో ట్రాక్టర్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. మహాశివరాత్రికి ఏర్పాటు చేసినట్లుగానే భక్తుల సౌకర్యార్థం అవసరమైన మేరకు ఉచిత బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. ఉత్సవాల్లో భక్తులను అలరించేందుకు కన్నడ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. కన్నడ భక్తి సంగీతవిభావరి కార్యక్రమాలను ఏర్పాటు చేయడంతో పాటు కన్నడ ప్రవచనాలు, కన్నడ భక్తి నాటకాలను కూడా ఏర్పాటు చేయాలని సంబంధిత విభాగాన్ని ఆదేశించారు. ఉత్సవాలలో భక్తుల సౌకర్యార్థమై నందిసర్కిల్, కల్యాణకట్ట, పాతాళగంగమెట్లమార్గం, సాక్షిగణపతి, హేమారెడ్డి మల్లమ్మ మందిరం, సెంట్రల్ పార్కింగ్, దేవస్థానం వైద్యశాల మొదలైన చోట్ల తాత్కాలిక సమాచార కేంద్రాలను ఏర్పాటు చేసి అందులో సిబ్బందిని నిరంతరం అందుబాటులో ఉంచాలని చెప్పారు.