తిరుమల : శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా గరుడసేవ రోజున తిరుమల (Tirumala) కు ద్విచక్ర వాహనాలను (Two-wheelers ) నిషేధించినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. గరుడ సేవకు భారీగా వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అక్టోబరు 8 న టీటీడీ రెండు ఘాట్ రోడ్ల (Ghat Roads) లో ఆక్టోబర్ 7న రాత్రి 9 గంటల నుంచి 9న ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాలకు అనుమతించబడడం లేదని వివరించారు.
ఈ సంవత్సరం తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబరు 4 నుంచి 12 వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయని వివరించారు. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరారు.
సెప్టెంబరు 10న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకొని సెప్టెంబరు 10వ తేదీన ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (Tirumanjanam) నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు వెల్లడించారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చ, శుద్ధి నిర్వహణ, అనంతరం ఉదయం 7 నుంచి 9.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుందన్నారు.
ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేపడుతామని వెల్లడించారు.