బాపట్ల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం తిరుపతి జిల్లా టీడీపీలో తీవ్ర విషాదం నింపింది. ఈ ప్రమాదంలో టీడీపీ చెందిన ఇద్దరు నేతలు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను భానుప్రకాష్ రెడ్డి, గంగపల్లి భాస్కర్‌గా గుర్తించారు. మరో నేత సోమశేఖర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు.
బాపట్ల జిల్లా పరిధిలోని జే పంగలూరు మండలం కొండ మంజులూరు వద్ద ముందు వెళ్తున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తెలుగు యువత అధ్యక్షుడు భాను ప్రకాష్ రెడ్డి, చిత్తూరు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి గంగపల్లి భాస్కర్ ప్రమాద స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. అదే కారులో ప్రయాణిస్తున్న ఐటీడీపీ నియోజకవర్గం ఇంఛార్జ్ సోమశేఖర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరులో ఓ వివాహానికి హాజరయ్యేందుకు కారులో బయల్దేరి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఇద్దరు నేతల మృతదేహాలను ఒంగోలులోని రిమ్స్‌కు తరలించారు.
ఈ ప్రమాద వార్త తెలియగానే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, గాయపడి దవాఖానలో చికిత్స పొందుతున్న సోమశేఖర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, ఇంఛార్జ్ పులివర్తి నాని కూడా వీరి మృతి పట్ల తీవ్ర సంతాపం ప్రకటించారు. వారి ఆత్మ శాంతించాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.