Srisailam | ఉదయాస్తమాన సేవ, ప్రదోషకాల సేవలు ప్రారంభం
శ్రీశైల మహా క్షేత్రంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు సర్వార్జిత సేవల్లో పాల్గొనడానికి భక్తులకు అవకాశం కల్పించాలని నిర్ణయించామని శ్రీశైలం దేవస్థానం కార్య నిర్వహణాధికారి (ఈవో) లవన్న తెలిపారు. ఇందుకోసం నూతనంగా రెండు సేవలు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. సోమవారం సాయంత్రం ఆయన దేవస్థాన పరిపాలన భవంలోన జరిగిన సమావేశంలో ఉదయాస్తమాన సేవ, ప్రదోషకాల సేవల పోస్టర్ విడుదల చేశారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే యాత్రికుల అభ్యర్థన మేరకు దేవస్థానం ఈ సౌకర్యార్యం కల్పించిందన్నారు.
ఈ సేవల్లో పాల్గొనే వారికి రోజుకు ఆరు టిక్కెట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని, అందుకు వారు www.srisailadevasthanam.org వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలని లవన్న తెలిపారు. ఈ సేవలలో ఉదయాస్తమాన సేవకు రూ.1,01,116, ప్రదోషకాల సేవకు రూ. 25,116 రుసుముగా నిర్ణయించారు.
ఉదయాస్తమాన సేవా టిక్కెట్ పొందిన దంపతులు తెల్లవారుజాము సుప్రభాత సేవ నుండి రాత్రి ఏకాంత సేవ వరకు జరిగే 14 విధాల కైంకర్యాలలో స్వయంగా పాల్గొనవచ్చు. ప్రదోషకాల సేవలో పాల్గొనే భక్తులకు స్వామివారి గర్బాలయంలో పంచామృతాభిషేము, అమ్మవారి ఆలయంలో శ్రీచక్ర కుంకుమార్చన, వేదాశీర్వచనం ఉంటుందని తెలిపారు. అదే విధంగా సేవాకర్తలకు వీఐపీ కాటేజీలలో బస ఏర్పాటు చేస్తామన్నారు.