Vizag Centra Jail | వైజాగ్ సెంట్రల్ జైల్లో మొబైల్ ఫోన్లు దొరకడం ఏపీ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా పెన్నా బ్యారక్ సమీపంలో పోలీసులకు నాలుగు అడుగుల లోతులో పాతిపెట్టిన ఓ ప్యాకెట్ కనిపించింది. పెన్నా బ్యారక్ సమీపంలోని పూల కుండీల వద్ద భూమిలో 4 అడుగుల లోతులో ఈ ఫోన్లను కవర్లో పెట్టి పాతిపెట్టారు. వాటిపై రెండు రాళ్లు కప్పి పైన పూల కుండీని పెట్టారు. అనుమానాస్పదంగా కనిపించడంతో దాన్ని పరిశీలించగా అందులో రెండు సెల్ఫోన్లు, ఒక పవర్ బ్యాంక్, రెండు చార్జింగ్ వైర్లు, ఫోన్ బ్యాటరీ కనిపించాయి.
సెల్ఫోన్లు దొరకడంతో పోలీసులు అప్రమత్తమై వాటిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ సెల్ఫోన్లలో సిమ్ కార్డులు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే ఈ విషయం తెలియగానే వైజాగ్ సీపీ శంఖబ్రత బాగ్చీ రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. సిమ్ కార్డులు దొరికన పెన్నా బ్యారక్‌లో రౌడీ షీటర్ హేమంత్ కుమార్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
విశాఖ సెంట్రల్ జైలు వివాదాలపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. సెంట్రల్ జైల్లో పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. వ్యవస్థలు ఏ స్థాయిలో నిర్వీర్యమయ్యాయో అర్థమవుతోందని అన్నారు. జైల్లో గంజాయి, సెల్ఫోన్ల ఘటనపై సమగ్రంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు