Srisailam | శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దేవస్థానంలో లోకక్షేమాన్ని కాంక్షిస్తూ పరివార దేవుళ్లకు వార పూజలు శాస్త్రోక్తంగా జరిపించినట్లు ఈవో చంద్రశేఖర ఆజాద్ తెలిపారు. ఆలయ ప్రాంగణంలో కొలువైవున్న కుమారస్వామికి మంగళవారం ఉదయం షోడషోపచార పూజాది క్రతువులు నిర్వహించారు. సాయంకాలం క్షేత్రపాలకుడైన బయలు వీరభద్రస్వామికి ప్రదోషకాలంలో అభిషేకార్చనలు జరిపించారు. ఆరుబయట ఆలయంలో భక్తులకు దర్శనమిచ్చే స్వామికి ఉదక స్నానం చేయించి విశేష పుష్పార్చన అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.
అనంతరం సంధ్యా సమయంలో నందిమండపం వద్ద కొలువైన శనగల బసవన్నకు ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు సుఖ సంతోషాలతో బాసిల్లాలని అర్చకపండితులు మహాసంకల్పాన్ని పఠించి పంచామృతాలు ఫలోదకాలతో పాటు మల్లికాగుండంలోని శుద్ధజలంతో అభిషేకం చేశారు. అనంతరం నందీశ్వరుడిపై స్వామిఅమ్మవార్ల ఉత్సవ మూర్తులను అధిష్టించి అష్టోత్తర శతనామ పూజలు చేసి.. నూతన వస్త్రాన్ని సమర్పించి నానబెట్టిన శెనగలు నైవేద్యంగా సమర్పించారు.