TTD QR-Code | తిరుమలలో శ్రీవారిని దర్శించుకునే భక్తులకు టీటీడీ తీపి కబురందించింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులు స్మార్ట్ ఫోన్ తెచ్చుకుంటే ఎవరినీ సంప్రదించకుండానే కొండపై ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తేలిగ్గా చేరవచ్చు. తిరుమల కొండపై గల వివిధ కార్యాలయాలు, వాటి వద్దకు వెళ్లేందుకు అవసరమైన మ్యాప్‌తో కూడిన `క్యూఆర్` కోడ్ విధానానికి శ్రీకారం చుట్టింది.
ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే.. భక్తుల అరచేతిలోకి తిరుమల మార్గదర్శిని వచ్చేసినట్లే. టీటీడీ గెస్ట్‌హౌస్‌లు, అకామిడేషన్ కాంప్లెక్స్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, టీటీడీ లడ్డూ కౌంటర్లు, దవాఖాన, పోలీస్ స్టేషన్, విజిలెన్స్ అధికారుల కార్యాలయాలతోపాటు అన్ని ప్రాంతాలు, ఆఫీసులు, 40 డిపార్ట్మెంట్ల వివరాలు ప్రత్యక్షం అవుతాయి. భక్తులు తాము వెళ్లాలనుకున్న ప్రాంతంపై క్లిక్ చేస్తే మ్యాప్ కూడా డిస్ప్లే అవుతుంది. ఈ విధానాన్ని ఈవో ధర్మారెడ్డి తన కార్యాలయంలో ప్రయోగాత్మకంగా పరిశీలించారు.
టీటీడీ ఇంజినీరింగ్, పబ్లిక్ రిలేషన్స్ విభాగాలు తయారు చేసిన ఈ క్యూఆర్ కోడ్ విధానాన్ని ధర్మారెడ్డి అభినందించారు. టీటీడీలోని వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే, భక్తులు తాము వెళ్లాల్సిన ప్రాంతాలు, ఆ ప్రాంతంపై క్లిక్ చేస్తే వెళ్లడానికి రూట్ మ్యాప్ కనిపించడమే కాదు.. ఆ ప్రాంతానికి తీసుకెళ్తుందని చెప్పారు. ఇది శ్రీవారి భక్తులకు ఎంతో ఉపయోగపడుతుందని ధర్మారెడ్డి మీడియాతో అన్నారు.
ఇప్పటివరకు భక్తులు టీటీడీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లాలంటే పలు ఇబ్బందులు ఎదుర్కొనే వారు. ప్రస్తుతం జరుగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులతో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని టీటీడీ పీఆర్వోను ఈవో ధర్మారెడ్డి కోరారు.