TTD | శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది. ప్రత్యేకంగా తయారు చేయించిన మంగళసూత్రాలను శ్రీవారి పాదాల వద్ద ఉంచి విక్రయించనున్నది. అలాగే లక్ష్మీకాసులను సైతం తయారు చేసి విక్రయించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో సోమవారం తిరుమల దేవస్థానం పాలకవర్గం సమావేశ జరిగింది. ఈ సందర్భంగా వార్షిక బడ్జెట్‌కు పాలకవర్గం ఆమోదముద్ర వేసింది. అనంతరం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు.
ధర్మప్రచారంలో భాగంగా బంగారు మంగళసూత్రాలను తయారుచేసి శ్రీవారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు పొందిన తరువాత భక్తులకు విక్రయించేందుకు నిర్ణయించామన్నారు. 5 గ్రాములు, 10 గ్రాముల్లో ఉంటాయన్నారు. వీటిని నాలుగు లేదంటే ఐదు డిజైన్లలో తయారు చేస్తామన్నారు. వీటితోపాటు లక్ష్మీకాసులను కూడా తయారు చేయాలని నిర్ణయించామన్నారు. వీటిని లాభాపేక్ష లేకుండా విక్రయిస్తాం. గతంలో 32 వేల మందికి సామూహిక వివాహాలు జరిపించినపుడు మంగళసూత్రాలు అందిస్తే ఏ ఒక్కరూ మతం మారలేదన్నారు. మహిళలకు స్వామివారి కానుక అన్నారు.