Tirumala | తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా గరుడ సేవ నాడు అలంకరించేందుకు చెన్నై నుంచి తిరుమలకు గొడుగులు రానున్నాయి. ఈ క్రమంలో నిర్వహించే గొడుగుల ఊరేగింపులో ఎటువంటి కానుకలు అందించరాదని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
గొడుగుల ఊరేగింపులో భక్తులు అందించే కానుకలు టీటీడీకి చేరవని స్పష్టం చేసింది. ఆ కానుకలతో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో పలు హిందూ సంస్థలు చెన్నై నుంచి గొడుగులను ఊరేగింపుగా తిరుమలకు తీసుకొచ్చి శ్రీవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇవి సెప్టెంబర్ 27వ తేదీన ఆలయానికి చేరుకుంటాయి. 28వ తేదీ సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి వరకు గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు.