TTD | మహాలయ అమావాస్య సందర్భంగా తిరుమలలోని కపిల తీర్థానికి భక్తులు భారీగా పోటెత్తారు. కపిలతీర్థంలో పిండాలు, తర్పణాలు వదిలేందుకు ఆదివారం భారీగా భక్తులు తరలివచ్చారు. అయితే ఆలయంలోకి వెళ్లే మొదటి ఆర్చి వద్ద తొక్కిసలాట జరిగిందని ప్రచారం మొదలైంది. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని సోషల్మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ స్పందించింది.
తిరుమలలో తొక్కిసలాట అని, కపిలతీర్థంలో ఏర్పాట్లు సరిగ్గా లేవంటూ సోషల్మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని టీటీడీ తెలిపింది. మహాలయ అమావాస్య సందర్భంగా తిరుపతి కపిలతీర్థం ఆలయం బయట ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో పితృ తర్పణాల కార్యక్రమం జరగడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొంది. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూలైన్లతో పాటు పటిష్ట భద్రతా ఏర్పాటు చేసినట్లు తెలిపింది. తిరుమలకు ఏమాత్రం సంబంధం లేకపోయినా.. కపిలతీర్థంలో తొక్కిసలాట అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. దుష్ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది