BR Naidu | తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తులకు గంట సమయంలోగా భక్తులకు శ్రీవారి దర్శనం కావాలనేది తన ఆలోచన అని టీటీడీ చైర్మన్గా నియామకమైన బీఆర్ నాయుడు తెలిపారు. టీటీడీ కొత్త చైర్మన్గా బీఆర్ నాయుడితో పాటు పాలకవర్గాన్ని బుధవారం నియమించింది. ఈ సందర్భంగా గురువారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. శ్రీవారి ట్రస్టును రద్దు చేయాలని నా అభిప్రాయమని చెప్పారు. దర్శనం విషయంలో గతంలో ఉన్నట్లు టోకెన్లు ఇచ్చే యోచనలో ఉన్నామన్నారు. మెటీరియల్ సప్లయ్, దేవస్థానం భూములపై ప్రత్యేక కమిటీలు వేస్తానన్నారు.
యూనివర్సిటీ, ఆసుపత్రులపై దృష్టి సారిస్తానని చెప్పుకొచ్చారు. తిరుమలలో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, పేపర్ గ్లాస్లో ఉచితంగా తాగునీరు ఇవ్వాలనేది నా ఆలోచన అన్నారు. టీటీడీ చైర్మన్ కావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. గత ప్రభుత్వం తిరుమలలో అనేక అక్రమాలకు పాల్పడిందని, తిరుమలలో మా సొంత ఖర్చులు మేమే భరిస్తామని చెప్పారు. తిరుమలలో పని చేసేవారంతా హిందువులే అయ్యుండాలన్నారు. తిరుమలలో వ్యర్థాల నుంచి దుర్గంధం వస్తోంది.. వాటిని తీసేయాలన్నారు. తిరుమలలో వాటర్ దందాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.