Tirumala | శ్రీవాణి టికెట్లపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీవాణి టికెట్ల కోటాను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు శ్రీవాణి కోటా కింద రోజుకు 1500 టికెట్లు ఇస్తున్నారు. ఆ కోటాను 2 వేలకు పెంచింది. ఇకపై ప్రతి రోజు కరెంటు బుకింగ్ కోటా కింద తిరుమలలో రెండు వేల టికెట్లు, రేణిగుంట విమానాశ్రయంలో 400 టికెట్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది.
శ్రీవాణి దర్శన సమయంలోనూ టీటీడీ మార్పులు చేసింది. శ్రీవాణి కోటా కింద ప్రస్తుతం ఉదయం మాత్రమే భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ఇకపై సాయంత్రం కూడా దర్శనానికి అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ఇలా రెండు పూటలు దర్శనానికి అనుమతించడం వల్ల గదులకు నెలకొన్న డిమాండ్ తగ్గుతుందని టీటీడీ అధికారులు చెబుతున్నారు.