TTD Income | హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): తిరుమలలో శ్రీవారి హుండీ ఆదాయం మరోసారి రూ.100 కోట్లు దాటింది. ఏప్రిల్ నెలలో భక్తులు శ్రీ వారి హుండీలో వేసిన కానుకల ద్వారా టీటీడీకి రూ.114.12 కోట్ల ఆదాయం వచ్చింది. టీటీడీకి హుండీ ద్వారా వచ్చే ఆదాయం వరుసగా 14వసారి రూ.100 కోట్లు దాటడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతేడాది మార్చి మొదలు ఈ ఏడాది ఏప్రిల్ వరకు హుండీ ద్వారా టీటీడీకి రూ.100 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. జూలైలో అత్యధికంగా రూ.139.45 కోట్ల ఆదాయం నమోదైంది. టీటీడీ చరిత్రలో హుండీ ద్వారా ఈ స్థాయిలో ఆదాయం రావడం ఇదే తొలిసారి. గతేడాది మార్చిలో రూ.128 కోట్లు, ఏప్రిల్‌లో రూ.127.50 కోట్లు, మేలో రూ.130.50 కోట్లు హుండీ ఆదాయం నమోదైంది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. పరీక్షలు ముగిసి, ఫలితాలు రావడం, వేసవి సెలవులతో భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు రావడంతో భక్తుల రద్దీ పెరిగింది. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. ఆళ్వార్ ట్యాంక్ గెస్ట్ హౌజ్ వరకు భక్తులు వేసి ఉన్నారు. టోకెన్ లేని భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు 24 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.
ఆదివారం శ్రీవారిని 82,582 మంది భక్తులు దర్శించుకోగా, 43,526 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. రూ.3.19 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. రాబోయే రోజుల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్న అధికారులు..అందుకు అనుగుణంగా ముందస్తుగా ఏర్పాట్లు చేపట్టారు.