హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): తిరుమలలోని హోటళ్లు, ఇతర దుకాణాల్లో ఆహార తయారీ నిబంధనలను తప్పకుండా పాటించాలని, లేనట్లయితే కఠిన చర్యలు తప్పవని టీటీడీ ఈవో జే శ్యామలరావు హెచ్చరించారు. తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనం సమీపంలో ఉన్న బాలాజీ భవన్ హోటల్‌ను ఫుడ్ సేఫ్టీ విభాగం (ఎఫ్ఎస్డీ) డైరెక్టర్ పూర్ణచంద్రరావు బృందంతో కలిసి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
హోటల్లో తయారు చేస్తున్న ఆహార పదార్థాలు, నిల్వ ఉన్న ముడిసరుకులు, పరిశుభ్రత తదితర పద్ధతులను వారు పరిశీలించారు. కొన్ని కిరాణా సామగ్రితో సహా ఆలుగడ్డ, కాలీఫ్లవర్, ఇతర కొన్ని కూరగాయలు కుళ్లిపోయినట్టు గుర్తించారు. పరిశుభ్రత, పారిశుద్ధ్య చర్యలు సక్రమంగా లేవని వారు తెలిపారు. యాత్రికుల ఫిర్యాదు మేరకు హోటల్‌ను తనిఖీలు చేశామని చెప్పారు.
హోటల్ నిర్వాహకులు ఆహార భద్రతా నిబంధనలను పాటించడం లేదని, అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్టు ఈవో శ్యామలరావు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు మరిన్ని నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అనంతరం మొబైల్ ల్యాబ్, ఫుడ్‌సేఫ్టీ ఆన్ వీల్స్‌ను ఈవో, ఎఫ్ఎస్డీ డైరెక్టర్ ప్రారంభించారు. ప్రత్యేకమైన ఈ వాహనం ఆహారం, నీటి నాణ్యతను తనిఖీ చేయడానికి అవసరమైన ల్యాబ్ పరికరాలతో ఉంటుందని వివరించారు. ఈ మొబైల్ ల్యాబ్ 80 రకాల పదార్థాల నాణ్యతలను తనిఖీ చేస్తుందని తెలిపారు.