తిరుమల : తిరుమలకు వచ్చే భక్తులు దివ్యానుభూతి పొందేలా టీటీడీ ఉద్యోగులు (TTD employees ) , సిబ్బంది అకింతభావంతో సేవలందించాలని అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సూచించారు. గురువారం తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో జాతీయ జెండా(Flag hoisting )ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. భారత జాతి స్వాతంత్య్రం (Independence Day) కోసం ఎందరో మహానేతలు తమ జీవితాలను అంకితం చేశారని అన్నారు.
హిందూ సనాతన ధర్మం, పురాణాలు, పవిత్ర గ్రంథాలు నిస్వార్థ సేవ, త్యాగం, సత్యాన్ని బోధించాయని వాటి స్ఫూర్తితో స్వాతంత్ర్యం సాధించామని వెల్లడించారు. వారి మార్గంలో ప్రయాణిస్తూ ఉద్యోగులందరూ టీమ్ వర్క్‌తో సేవలను అందజేస్తామని ప్రతిజ్ఞ చేయాలని కోరారు.
తిరుమలకు ప్రతి రోజు దాదాపు 85 వేల మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పిస్తున్నామని, టీటీడీ ఉద్యోగులు నాణ్యమైన అన్నప్రసాదాలను అందజేస్తూ, ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో 24 గంటలూ సేవలందిస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో యాత్రికులకు మెరుగైన సేవలను అందిస్తామని, ప్రపంచవ్యాప్తంగా టీటీడీ ఖ్యాతిని పెంపొందిస్తామని వివరించారు.