తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి ముగ్గురు భక్తులు శుక్రవారం రూ. 30 లక్షలు విరాళాలను అందజేశారు. బెంగళూరుకు చెందిన దాతలు మంజునాథ రెడ్డి, కృష్ణారెడ్డి కలిసి ఎస్.వి అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.20 లక్షలు, శ్రీ బాలాజీ ఆరోగ్యవరప్రసాదిని స్కీమ్ కు ఆనందకుమార్ అనే భక్తుడు రూ.10 లక్షలు అందజేశారు. దాతలు ఈ మేరకు విరాళం చెక్కులను తిరుమలలోని కార్యాలయంలో టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డికి అందజేశారు.
ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు పుష్కరిణి మూసివేత
తిరుమలలో శ్రీవారి ఆలయం వద్ద గల పుష్కరిణిలో నీటిని పూర్తిగా తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టేందుకు గాను ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు పుష్కరిణిని మూసివేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ కారణంగా నెల రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదని తెలిపారు.
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా నెల రోజుల పాటు పుష్కరిణిలో నీటిని తొలగించి చిన్న చిన్న మరమ్మతులను పూర్తి చేస్తామని అన్నారు. టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు చేపడుతున్నామని వివరించారు.