TTD Darshan Tickets | తిరుమల శ్రీవారి టికెట్ల బుకింగ్‌లో అక్రమాలు వెలుగుచూశాయి. ట్రావెల్ ఏజెంట్లు సాఫ్ట్వేర్ గిమ్మిక్కులతో టీటీడీ వెబ్‌సైట్‌ను హైజాక్ చేసి, సామాన్య భక్తుల కంటే ముందే టికెట్లు బుక్ చేస్తున్నట్లు తెలిసింది. అలా బుక్ చేసిన ఒక్కో టికెట్‌పై రూ.3వేల వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు బయటపడ్డాయి. దీంతో టీటీడీ విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించింది.
శ్రీవాణి ట్రస్టుకు విరాళం ఇచ్చే భక్తుల కోసం టీటీడీ ప్రతిరోజు ఆన్లైన్లో 800 టికెట్లను జారీ చేస్తుంది. అయితే పలువురు ప్రైవేటు నెట్ సెంటర్లు, ట్రావెల్ ఏజెంట్లు అందులోని లొసుగులను ఆసరాగా చేసుకున్నారు. ఆటోఫిల్లింగ్, తదితర థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్లను ఉపయోగించి, టికెట్లను వేగంగా బుక్ చేస్తున్నారు. ఈ టూల్స్ ద్వారా అధికారిక వెబ్సైట్ పూర్తిస్థాయిలో లోడ్ అవ్వకముందే సమాచారాన్ని సర్వర్‌లో పంపుతున్నారు. భక్తుల ఆధార్ వివరాలను ముందే సేకరించి సాఫ్ట్‌వేర్‌లో సిద్ధంగా ఉంచడంతో సామాన్య భక్తుల కంటే వేగంగా వీరు బుకింగ్ పూర్తి చేస్తున్నారు. ఇలా రోజుకు 400 నుంచి 500 టికెట్లను బుక్ చేసి పక్కదారి పట్టిస్తున్నారు. రూ.10,500 లభించే శ్రీవాణి టికెట్లను రూ.13,500కు అక్రమంగా విక్రయిస్తున్నారు.
చెన్నైకి చెందిన పద్మావతి ట్రావెల్స్ అనే సంస్థ శ్రీవాణి టికెట్లను అక్రమంగా విక్రయిస్తుందని వచ్చిన ఫిర్యాదుతో విజిలెన్స్ అధికారులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టారు. దీనిపై ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్ విభాగానికి లేఖ రాశారు. ఒకే ఐపీ అడ్రస్ నుంచి, ఒకే మొబైల్ నంబర్‌పై పెద్ద సంఖ్యలో టికెట్లు బుక్ అయ్యాయా? ప్రైవేటు వ్యక్తులకు భక్తుల ఆధార్ డేటా ఎలా అందుతోంది? హ్యాకింగ్ చేస్తున్నారా? లేదా లోపల ఎవరైనా సహకరిస్తున్నారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.