తిరుమల: భారీ వర్షాల నేపథ్యంలో టీటీడీ (TTD) ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా తిరుమల శ్రీవారిమెట్టు నడక మార్గాన్ని మూసివేసింది. మరోవైపు అలిపిరి కాలినడక మార్గం నుంచి భక్తులను అనుమతిస్తున్నది. వాతావరణశాఖ హెచ్చరికల దృష్ట్యా అప్రమత్తమైన టీటీడీ.. కొండచరియలపై నిఘా ఉంచి ఘాట్రోడ్లలో ట్రాఫిక్జామ్ కాకుండా ఏర్పాట్లు చేసింది. భక్తుల దర్శనాలు, వసతికి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసింది. అయితే వాయుగుండం తీరం దాటిన తర్వాత వర్షాకు కురియకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
కాగా, భారీ వర్షాల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. అన్ని విభాగాలు సమన్వయంతో పని చేసి ఎలాంటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. కొండ చరియలపై ప్రత్యేక నిఘా ఉంచి ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఘాట్ రోడ్లలో జేసీబీలను సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు.
ట్రాఫిక్ పోలీసులు ఇంజినీరింగ్ సిబ్బందితో సమన్వయం చేసుకుని పని చేయాలన్నారు. విద్యుత్ కు అంతరాయం కలకగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఐటీ వింగ్ భక్తుల దర్శనాలు, వసతి, ప్రసాదం వంటి కార్యాకలాపాలకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయం చూసుకోవాలన్నారు. వైద్య శాఖ అంబులెన్సు లను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైతే అగ్ని మాపక సిబ్బంది వేగంగా స్పందించేందుకు అన్నీ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే పాపవినాశనం, శిలా తోరణం మార్గాలను టీటీడీ మూసివేసింది. వాతావరణ పరిస్థితులను బట్టి ఈ మార్గాల్లో రాకపోకలను టీటీడీ పునరుద్ధరించనుందని తెలిపారు.