తిరుమల : తిరుమల దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు కల్పించిన సేవా కార్యక్రమాలు తనకు ఎంతో సంతృప్తినిచ్చాయని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ( YV Subba reddy) తెలిపారు. టీటీడీ ధర్మకర్తల మండలి చివరి సమావేశం సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో చైర్మన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ నాలుగేళ్ల పదవీకాలంలో తీసుకున్న చర్యలను వివరించారు.
నాలుగేళ్లలో ఎక్కువమంది సామాన్య భక్తులకు శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం (Darsan) కల్పించేందుకు ఎల్1, ఎల్2, ఎల్3 టికెట్లు రద్దు చేయడం, సామాన్యులకు స్వామివారి తొలి దర్శనం కల్పించేందుకు వీఐపీ బ్రేక్ (VIP Break Darsan) సమయాన్ని మార్చడం అత్యంత సంతృప్తినిచ్చాయని పేర్కొన్నారు. తిరుమల దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు (Common devotees) వసతి, ఇతర సదుపాయాలు మెరుగుపరచడం కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు.అయితే, ఈ రెండు నిర్ణయాలు మాత్రం ఎప్పటికీ మరువలేనివని తెలిపారు.
నాలుగేళ్లపాటు చైర్మన్‌గా పనిచేసే అదృష్టం ప్రసాదించిన శ్రీ వేంకటేశ్వరస్వామికి అధికారులకు సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నూతన చైర్మన్‌గా నియమితులైన భూమన కరుణాకర్‌రెడ్డి అనుభవం టీటీడీ అభివృద్ధికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.
24 కోట్లతో రెండు ఘాట్ రోడ్లలో రక్షణ గోడల నిర్మాణం
రూ. 4 కోట్లతో అలిపిరి కాలిబాట మార్గంలోని మొదటి ఘాట్ రోడ్డులో మోకాలిమెట్టు నుంచి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం వరకు మిగిలి ఉన్న ప్రదేశంలో ఫుట్‌పాత్ షెల్టర్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. రూ.2. 20 కోట్లతో తిరుమలలోని ఔటర్ రింగ్ రోడ్డులో విద్యుత్ బస్సుల కోసం ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.
రూ. 2.50 కోట్లతో తిరుమలలోని పిఏసి-1లో అభివృద్ధి పనులు, 24 కోట్లతో రెండు ఘాట్ రోడ్లలో రక్షణ గోడల నిర్మాణం, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద భక్తులు వేచి ఉండేందుకు తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ తరహాలో 23.50 కోట్లతో యాత్రికుల వసతి భవనం నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు. టీటీడీ నూతన చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డిని ఏపీ ప్రభుత్వం నియమించడంతో త్వరలో ఆయన ప్రమాణం చేయనున్నారు .