తిరుమల : కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామిజీని (Vijayendra Saraswati Swamiji) టీటీడీ చైర్మన్ (TTD Chairman) బీ.ఆర్.నాయుడు ఆదివారం సాయంత్రం తిరుమలలోని కంచి మఠంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్వామిజీ చైర్మన్ ను ఆశీర్వచనం అందించారు.
ఈ సందర్భంగా టీటీడీ నూతన ధర్మకర్తల మండలి ఇటీవల తీసుకున్న నిర్ణయాలను పీఠాధిపతి అభినందించారు. తిరుమల పవిత్రతను కాపాడే విధంగా , భక్తులకు మేలు చేకూరేలా నిర్ణయాలు తీసుకోవడం ప్రశంసనీయమని తెలిపారు. తిరుమలను మరింత సుందర దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని, వేదవిద్య వ్యాప్తికి కృషి చేయాలని చైర్మన్ కు సూచించారు.
లడ్డూ కౌంటర్ లో టీటీడీ అదనపు ఈవో ఆకస్మిక తనిఖీలు
తిరుమలలోని లడ్డూ కౌంటర్లో ( Laddu Counter) టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా టోకెన్ల స్కానింగ్, లడ్డూల జారీ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. లడ్డూల రుచి, నాణ్యత పెరగడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో శ్రీధర్, డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.