తిరుమల, మే 10 : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) యాజమాన్యం వారి ఉద్యోగులకు హెల్మెట్లను పంపిణీ చేసింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు శనివారం తిరుమలలోని తన క్యాంప్ కార్యాలయంలో ఉద్యోగులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీటీడి ఉద్యోగుల భద్రతను నిర్ధారించడంలో భాగంగా హెల్మెట్లను పంపిణీ చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
గుంటూరుకు చెందిన జాలాది రఘురామ్, ఢిల్లీకి చెందిన కేసీఎన్ హెల్మెట్స్ అధిపతి నవీన్ హెల్మెట్లను విరాళంగా ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు చెప్పారు. మొదటి దశలో దాదాపు రూ.5 లక్షల విలువైన 555 హెల్మెట్లను విరాళంగా ఇచ్చినట్లు వెల్లడించారు. మరో 15 రోజుల్లోపు అదనంగా 500 హెల్మెట్లను విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇవి నాణ్యత, వినియోగంలో సంతృప్తికరంగా ఉన్నాయని తేలితే, మరో 5 వేల హెల్మెట్లను అందిస్తామని టిటిడి ఛైర్మన్ తెలిపారు.