TTD | కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ అక్టోబర్ 4 నుంచి 12 వరకు నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా జరుగనున్నాయి. ఉత్సవాలకు 3న సాయంత్రం అంకురార్పణ జరుగనున్నది. దీంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వాహన సేవలపై స్వామివారి వివహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు. అయితే, బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో గదుల కేటాయింపుపై తిరుమల తిరుపతి దేవస్థానం బుధవారం కీలక ప్రకటన చేసింది. తిరుమలకు వచ్చే సాధారణ యాత్రికులకు మరిన్ని వసతి సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో బ్రహ్మోత్సవాల సమయంలో వివిధ ట్రస్ట్‌లు, స్కీమ్‌ల దాతలకు వసతి బ్లాక్ చేసినట్లు పేర్కొంది. అక్టోబర్ 4న ధ్వజారోహణం, 12న చక్రస్నానం జరిగే రోజుల్లో మినహా దాతలకు అందుబాటులో ఉన్న ప్రత్యేకాధికారాల ప్రకారం దర్శనానికి అనుమతిస్తారని, దాతలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని దేవస్థానం బోర్డు కోరింది.