తిరుపతి : టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప శిక్షణ సంస్థలో విద్యార్థులను భారతీయ సంస్కృతి, వారసత్వానికి దిశా నిర్దేశకులుగా తీర్చిదిద్ధాలని టీటీడీ జేఈవో సదా భార్గవి ( విద్యా, ఆరోగ్యం) అధ్యాపకులకు సూచించారు. విద్యార్థుల హస్త కళల నైపుణ్యాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని అన్నారు. అలిపిరి వద్ద ఉన్న శిల్ప కళాశాలలో ఆరు రోజుల పాటు విద్యార్థులు నిర్వహించే వివిధ కళాఖండాల ప్రదర్శన, విక్రయాలను స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మతో కలిసి ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ టీటీడీ మాత్రమే ఆలయ వాస్తు నిర్మాణం, శిల్పకళ, పెయింటింగ్ వంటి సాంప్రదాయ కళలను గుర్తించి, ప్రోత్సాహాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. శిల్ప కళాశాలను 1960లో టీటీడీ ప్రారంభించిందని, ఆరు దశాబ్దాలుగా 760 మంది విద్యార్థులు తమ నాలుగేళ్ల కోర్సును విజయవంతంగా పూర్తి చేసి వివిధ రంగాలలో స్థిరపడ్డారన్నారు. భావితరాలకు సుసంపన్నమైన ఆలయ సంస్కృతిని, వాస్తు శిల్ప సంపదను అందించేందుకు సంస్థ కృషి చేయాలన్నారు. ఇందులో ఆలయ నిర్మాణ విభాగము, శిలా, సుధా, లోహ, దారు (చెక్క) శిల్ప విభాగం, సంప్రదాయ వర్ణ చిత్రలేఖన, సంప్రదాయ కలంకారి కళ వంటి కోర్సులను అందిస్తున్నట్లు తెలిపారు.
అంతకు ముందు ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు ఉంచిన సాంప్రదాయ కళాఖండాల ప్రాముఖ్యతను, దాని తయారీ ప్రక్రియను ఆయా విభాగాల విద్యార్థులు జేఈవోకు వివరించారు. దేవస్థానం విద్యాశాఖాధికారి సి.గోవిందరాజన్, ప్రిన్సిపాల్ వెంకట్ రెడ్డి, సీనియర్ అధ్యాపకులు జి.సాగర్, టీటీడీ విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.