అమరావతి : ఏపీలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో (Trust ) నమ్మకం తగ్గుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) పేర్కొన్నారు. బుధవారం ఏపీ సచివాలయంలో కలెక్టర్, ఎస్పీలతో నిర్వహించిన సదస్సులో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pawankalyan) , మంత్రులు, సీఎస్ నీరబ్‌కుమార్, డీజీపీ ద్వారాకా తిరుమల రావు తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వంపై ఉన్న నమ్మకం తగ్గటానికి ప్రజలకు సరైన పరిష్కారం చూపించటం లేదని అర్థం అవుతుందని అన్నారు. అధికారులు ప్రజలకు సమాధానం చెప్పేటప్పుడు నిర్లక్ష్య ధోరణి ఉండకూడదదని సూచించారు. సమస్యలను మానవత్వంతో ఆర్థిక, ఆర్థికేతర అంశాలుగా వేరుచేసి పరిష్కరించాలన్నారు.
సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇచ్చిన ఫిర్యాదులన్నీ ఒకేచోట నమోదు చేయాలన్నారు. గడిచిన ఆరు నెలల్లో ప్రజల నుంచి 1,29, 963 ఫిర్యాదులు రాగా రెవెన్యూశాఖకు 78,700 ఫిర్యాదులు , పోలీసుశాఖకు 14,119 ఫిర్యాదులు, మున్సిపల్ శాఖకు 13,146 వచ్చాయని వెల్లడించారు. ఫిర్యాదులను 70శాతం పరిష్కరించినట్లు అన్ని విభాగాలు చెబుతున్నాయని తెలిపారు.
అటవీ భూములపై వివిధశాఖలు కలిసి చర్చించి పరిష్కారం చూపాలన్నారు. ఇంకా రాష్ట్రంలో 50 లక్షల మంది సమాచారం లేదని కలెక్టర్ల సదస్సులో ప్రభుత్వం ప్రకటించింది. 5.4 కోట్ల మంది జనాభాకు 4.9 కోట్ల మంది వివరాలే ఉన్నాయని, మిగతా 50 లక్షల మంది పౌరుల సమాచారం ప్రభుత్వం వద్ద లేదని స్పష్టం చేసింది. గతంలో చేసిన సర్వేల్లో వివరాలు ఇవ్వకే ఈ పరిస్థితి వచ్చిందని , కలెక్టర్లు దృష్టి పెట్టి జనవరి 31లో వివరాలు సేకరించాలని సూచించారు.
ఇంటింటి సర్వే ద్వారా అందరి వివరాలు నమోదు చేయాలన్నారు. నేషనల్ పేమెంట్స్ సంస్థతో ప్రజల బ్యాంకు వివరాలు అనుంధానించాలని, ప్రతి ఇంటినీ జియోట్యాగింగ్‌తో అనుసంధానించి ఫొటోలు తీయాలని పేర్కొన్నారు . గ్రామాలు, హ్యాబిటేషన్ల వారీగా కుటుంబాలను మ్యాపింగ్ చేయాలని సూచించారు.