Tragedy in AP | ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో శుక్రవారం పెను విషాదం చోటు చేసుకున్నది. అచ్చంపేట మండలం మాదిపాడు గ్రామ సమీపంలోని శ్వేత శృంగాచలం వేద పాఠశాల విద్యార్థులు న కృష్ణానదిలో ఈత కొట్టేందుకు వెళ్లారు. కానీ ఈత రాకపోవడంతో నీట మునిగిపోవడంతో ఆరుగురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ఈ సంగతి తెలియగానే అక్కడికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను వెలికి తీశారు.
మృతులను హర్షిత్ శుక్లా, శుభమ్ త్రివేది, అన్షుమన్ శుక్లా, శివ శర్మ, నితేష్ కుమార్ దిక్షిత్ అని గుర్తించారు. మరొకరిని గుర్తించాల్సి ఉంది. వీరు ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల విద్యార్థులని పోలీసులు తెలిపారు. నదిలో సుడి గుండాల వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. ప్రమాద స్థలంలో కనీసం హెచ్చరిక బోర్డులు లేవని ఆరోపిస్తున్నారు. నదిలో విద్యార్థులెవరైనా గల్లంతయ్యారా? అన్న అనుమానంతో బోట్లతో పోలీసులు గాలిస్తున్నారు.