Train Reverse | ప్రమాదవశాత్తూ కింద పడిపోయిన ఓ ప్రయాణికుడి కోసం రైలు ఏకంగా వెనక్కి వెళ్లింది. అతని ప్రాణాన్ని కాపాడేందుకు దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ వెనక్కి వెళ్లొచ్చింది. ఏపీలోని ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని బ్రాహ్మణ, కోడూరు గ్రామాలకు చెందిన కమలకంటి హరిబాబు(35), మావోబాబు, వెంకటేశ్వర్లు, విమలరాజు భవన నిర్మాణ కార్మికులు. పనికోసం యలహంకకు బయల్దేరారు. సోమవారం సాయంత్రం గుంటూరులో కొండవీడు ఎక్స్‌ప్రెస్ ఎక్కారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గజ్జలకొండ దాటిన తర్వాత హరిబాబు భోజనం చేశాడు. అనంతరం వాష్‌బేసిన్ దగ్గర చేతులు కడుక్కుని అక్కడే గేటు దగ్గర నిల్చున్నాడు. అప్పుడే రైలు భారీ కుదుపునకు గురవ్వడంతో ప్రమాదవశాత్తూ హరిబాబు రైలులో నుంచి కిందపడిపోయాడు. ఇది గమనించిన అతని స్నేహితులు వెంటనే చైన్ లాగారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న లోకో పైలట్లు.. గుంటూరు రైల్వే అధికారుల అనుమతి తీసుకుని రైలును దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ వెనక్కి తీసుకెళ్లారు. అక్కడ పట్టాల పక్కన పడివున్న హరిబాబును గుర్తించిన అతని స్నేహితులు, రైల్వే సిబ్బంది.. ఓ బోగీలోకి ఎక్కించారు. అనంతరం మార్కాపురం రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ సిద్దంగా ఉన్న 108 వాహనంలో హరిబాబును మార్కాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రైల్వే అధికారులు అంత కష్టపడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పరిస్థితి విషమించడంతో హరిబాబు ఆస్పత్రిలోనే కన్నుమూశాడు.