అమరావతి : నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సంతోషంగా వేడుకలు జరుపుకుంటున్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరిపాలెంలో ఓ కుటుంబం నూతన సంవత్సర వేడుకలు చేసుకుంది. కేక్ కటింగ్ సమయంలో కుటుంబసభ్యుల మధ్య వివాదం చెలరేగడంతో ఒకరినొకరు పిడిగుద్దులు, కర్రలతో దాడులకు పాల్పడ్డారు.
చివరకు ఈ వివాదం కత్తిపోట్లకు దారితీయడంతో చిన్న అనే వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు కత్తితో పొడిచారు. ఈ దాడిలో చిన్న మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహానికి పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.