LB Nagar Traffic Jam | సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో లోక్‌సభకు పోలింగ్ జరుగనున్నది. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఆంధ్రప్రదేశ్ వాసులు, తెలంగాణలోని వివిధ జిల్లాల ప్రజలు ఓటేసేందుకు సొంతూళ్లకు బయలుదేరారు. దీంతో శనివారం సాయంత్రం విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై ఎల్బీ నగర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నది. సొంతూళ్లకు వెళ్లే వారి వాహనాలతో జాతీయ రహదారి రద్దీగా మారింది. ఏపీతోపాటు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, కోదాడ తదితర ప్రాంతాల్లోని స్వగ్రామాలకు వెళ్లే వారు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు, సొంత వాహనాలతో రద్దీ నెలకొంది. ఫలితంగా ఎల్బీ నగర్ నుంచి పనామా వరకూ వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు, మరోవైపు ఆర్టీసీ సిబ్బంది ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నా ప్రయాణికులు ఇబ్బందుల పాలవుతున్నారు. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్, పంతంగి టోల్ గేట్ వద్ద కూడా వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది.