అనంతపురం: సినిమా టిక్కెట్ల రేట్ల విషయంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ నటులు పోషించిన పాత్రను చూస్తే వారు ఏపీ సీఎం జగన్‌కు లొంగిపోయినట్లుగా కనిపిస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. సినిమాను బతికించుకోవడం ఇలా కాదనుకుంటా అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో బిగ్‌బాస్ షోను లైసెన్స్ పొందిన వ్యభిచార కేంద్రమని, దాన్ని నడుపుతున్నందుకు నాగార్జునపై గౌరవం పోయిందని మండిపడ్డారు.
అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల సీఎం జగన్‌తో కలిసినప్పుడు అగ్రహీరోలు చిరంజీవి, నాగార్జున, మహేశ్‌బాబులు సినిమా టికెట్ ధరల విషయంలో అసహాయ పాత్ర పోషించారని అన్నారు. జగన్‌తో భేటీలో వీళ్లు ప్రవర్తించిన తీరు లొంగిపోయి ఉన్నట్లుగా కనిపించిందని చెప్పారు. వీరి ప్రవర్తన తెలుగు సినీ పరిశ్రమకు ప్రాతినిధ్యం వహించినట్లు కనిపించ లేదన్నారు. వాళ్తు తెలుగు సినిమా పరిశ్రమకు ప్రాతినిధ్యం వహిస్తే.. మా ఆఫీస్ బేరర్లు ఎందుకు వారితో రాలేదని ప్రశ్నించారు.
సినిమా టికెట్ల వివాదంతో రాష్ట్రంలో సాంస్కృతిక సంక్షోభానికి కారణం సీఎం జగన్యే అని నారాయణ ఆరోపించారు. వైఎస్ వివేకానంద హత్య కేసులో రోజుకో కొత్త విషయాలు వెల్లడవుతున్నాయని, హత్యా రాజకీయాలకు, సంస్కృతికి సీఎం జగన్ కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు ఉన్నదని నారాయణ విచారం వ్యక్తం చేశారు. వివేకా హత్యకు సీఎం జగన్ బాధ్యత వహించాలన్నారు.