అమరావతి : సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని చివాట్లు పెట్టిందని, ఇది సీఎం జగన్‌కు చెంపపెట్టు లాంటిదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో కొవిడ్ బాధిత కుటుంబాలకు చేయూతను అందించేందుకు కేంద్రం , విపత్తు నిర్వహణ సంస్థలు రాష్ట్రానికి రూ. 1,100 కోట్ల నిధులను విడుదల చేసిందని తెలిపారు. ఈ నిధులను వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించారు.
ఈ నిధుల మళ్లింపును సుప్రీం తీవ్రంగా తప్పు పట్టిందని విమర్శించారు. నిధులను ఎస్డీఆర్ఎఫ్ ఖాతాలో జమ చేయాలని ఆదేశించిందని వివరించారు. కొవిడ్‌తో ఛిన్నాభిన్నమైన కుటుంబాలను ఇప్పటికైనా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కొవిడ్ నిధులు పక్కదారి పట్టించిన వ్యవహారంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది. మళ్లించిన నిధులను తిరిగి రెండువారాల్లో ఎస్డీఆర్ఎఫ్ ఖాతాలో జమ చేయాలని జస్టిస్ ఎం.ఆర్షా ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది . పీడీ ఖాతాల్లోకి మళ్లించిన సుమారు. రూ. 1,100 కోట్లను ఎస్డీఆర్ఎఫ్ ఖాతాలోకి జమ చేయాలని స్పష్టం చేసింది. కరోనా పరిహారం అందలేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే నాలుగు వారాల్లోగా సమస్యను పరిష్కరించాలని వెల్లడించింది.