Tirupati Zoo Park | తిరుపతి జూ పార్క్ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన సందర్శకుడిని సింహం దాడి చేసి చంపడంతో జూ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎన్‌క్లోజర్ దగ్గరకు విజిటర్స్ వెళ్లకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే సింహాలు ఉన్న లయన్ ఎన్క్లోజర్ను మూసివేశారు. అలాగే వ్యక్తి మృతికి కారణమైన సింహాన్ని నైట్ హౌస్‌లోనే ఉంచేశారు.
రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద్ గుర్జార్ గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చాడు. మధ్యాహ్న సమయంలో శ్రీవేంకటేశ్వర జూపార్క్‌కు వెళ్లిన ప్రహ్లాద్.. సిబ్బంది వారిస్తున్నా వినకుండా సింహాల ఎన్‌క్లోజర్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ తాళాలు వేసి ఉండటంతో మొదటి గేటు ఎక్కి లోపలికి దూకాడు. జూలో మూడు సింహాలు ఉండగా.. వాటిలో దుంగాపూర్ అనే సింహం అతనికి 100 మీటర్ల దూరంలో కనిపించింది. దాన్ని చూసి ప్రహ్లాద్ గట్టిగా అరిచాడు. సింహం తనవైపు చూడగానే తొడగొట్టి పిలిచాడు. ప్రహ్లాద్‌ను చూడగానే సింహాం వేగంగా అతని వైపు పరిగెత్తుకు వచ్చింది. సింహం తనవైపు రావడంతో భయపడిపోయిన ప్రహ్లాద్ వెంటనే.. పక్కనే ఉన్న చెట్టు ఎక్కేందుకు ప్రయత్నించాడు. కానీ కంగారులో కాలుజారి కిందపడిపోయాడు. ఆ వెంటనే ప్రహ్లాద్ దగ్గరకు వచ్చిన సింహం.. అతని మెడను నోటితో పట్టుకుని వంద మీటర్లకు పైగా దూరం లాక్కెళ్లింది. ఇది గమనించిన సిబ్బంది పరుగున వచ్చి సింహాన్ని బోనులో బంధించాడు. కానీ అప్పటికే సింహం మెడ పట్టుకుని కొరకడంతో ప్రహ్లాద్ అక్కడిక్కడే మరణించాడు.