Tirumala Brahmotsavam | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు అక్టోబర్ 2న దసరా పండుగతో ముగియనున్నారు. ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాటు చేస్తున్నది. అదే సమయంలో పోలీసులు సైతం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారని.. ఈ మేరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు వెల్లడించారు. ఉత్సవాల సందర్భంగా ఆయన గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి భద్రతా చర్యల గురించి వివరించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి మరింత కట్టుదిట్టంగా భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా 4వేల మంది పోలీసు సిబ్బందిని మోహరించనున్నట్లు తెలిపారు.
తిరుమలలో 3వేల మంది.. తిరుపతిలో వెయ్యి మందితో భద్రతను పర్యవేక్షించనున్నట్లు సుబ్బారాయుడు పేర్కొన్నారు. అదే సమయంలో టీటీడీకి చెందిన 1500 మంది విజిలెన్స్ సిబ్బంది సైతం క్షేత్రస్థాయిలో సేవలందిస్తారని టీటీడీ ముఖ్య భద్రత అధికారి మురళీకృష్ట తెలిపారు. తిరుమల, తిరుపతిలోని వ్యూహాత్మక ప్రదేశాల్లో 4వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి.. పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన గరుడ సేవ రోజున భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని.. ఆ రోజున తిరుమల ఘాట్ రోడ్లపై ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధించనున్నట్లు ఎస్పీ వెల్లడించారు. భక్తులు వ్యక్తిగత ఆర్టీసీ బస్‌లను ఉపయోగించాలని ఆయన సూచించారు. భక్తుల సౌకర్యార్థం, తిరుపతిలో ఐదు ముఖ్య ప్రాంతాల్లో భారీ పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల కోసం ఆక్టోపస్, ఎన్డీఆర్ఎఫ్ వంటి ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచామని వివరించారు.