తిరుమల : కేంద్ర మంత్రి జితన్రామ్ మాంజీ ( Union Minister Jitanram Manji) ,రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుక్రవారం తిరుమల ( Tirumala ) లో శ్రీవారిని దర్శించు కున్నారు. మూలవిరాట్ దర్శనం తరువాత పండితులు మంత్రులకు ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం బయట కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు.
స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, తిరుమల క్షేత్రం స్వర్గాన్ని తలపిస్తోందని పేర్కొన్నారు. క్షేత్ర నిర్వహణ అద్భుతంగా ఉందని, ఇక్కడ పనిచేసే పండితులు, అర్చకులు, అధికారులు, సిబ్బంది పనితీరును ప్రశంసించారు. పరిసరాల పరిశుభ్రత బాగుందన్నారు.
శిలాతోరణం వరకు భక్తుల క్యూ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కంపార్టుమెంట్లు నిండి శిలాతోరణం వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం అవుతుందని ఆలయ అధికారులు వివరించారు. గురువారం 70,141 మంది భక్తులు దర్శించుకోగా 33,821 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.23 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.