Divvela Madhuri | దివ్వెల మాధురికి తిరుమల పోలీసులు షాకిచ్చారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి వెళ్లి మరీ ఆమెకు 41 ఏ కింద నోటీసులు జారీ చేశారు. విచారణకు తిరుమలకు రావాలని ఆదేశించారు.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దువ్వెల మాధురితో కలిసి ఇటీవల తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరు మాఢ వీధుల్లో ఫొటోలు దిగుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. తాము సహజీవనం చేస్తున్నామని, త్వరలోనే పెళ్లి చేసుకుంటామని చెప్పారు. ఇలా పవిత్రమైన మాఢవీధుల్లో తమ వ్యక్తిగత విషయాలు పంచుకోవడం వివాదాస్పదమైంది.
టీటీడీ నియమనిబంధనలు, సంప్రదాయాలను ఉల్లంఘిస్తూ, సోషల్మీడియాలో రీల్స్ కోసం వీడియోలు తీసుకుంటూ భక్తుల మనోభావాలు దెబ్బతీశారంటూ తిరుమల టూటౌన్ పోలీసులకు టీటీడీ విజిలెన్స్ ఏవీఎస్వో గురువారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బీఎన్ఎస్ 292, 296, 300 సెక్షన్ 66 – 200 – 2008 కింద కేసులు నమోదు చేశారు. కేసు విచారణలో భాగంగా 41ఏ కింద నోటీసులు జారీ చేశారు.