తిరుమల : తిరుమల(Tirumala) శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు పాదరక్షలు(Footwear) భద్రపరుచుకునేందుకు వీలుగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఏప్రిల్ రెండవ వారంలోపు 11 కౌంటర్లు (Counters) సిద్ధం చేస్తామని టీటీడీ ఈవో(Ttd EO) ఏవి.ధర్మారెడ్డి తెలిపారు. చాలాకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ కౌంటర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు.
ప్రధాన కళ్యాణకట్ట ప్రవేశ మార్గం, అన్నదానం కాంప్లెక్స్ ప్రవేశ మార్గం, టీబీసీ బ్రిడ్జి నారాయణగిరి షెడ్ల మధ్య ఉన్న ప్రాంతం, నారాయణగిరి షెడ్ల ప్రవేశ మార్గం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ఎదురుగా పాదరక్షల కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఏటీసీ సర్కిల్ , వైభవోత్సవ మండపం , సుపథం, కళ్యాణకట్ట నుంచి బేడి ఆంజనేయ స్వామి ఆలయం మధ్య ఉన్న ఆర్చి , పీఏసీల , శ్రీవారి సేవాసదన్-1,2 వద్ద ఈ కౌంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.ఈ కౌంటర్లు తాత్కాలికంగా వీజీవో ఆధ్వర్యంలో పనిచేస్తాయని పేర్కొన్నారు.
భక్తులు సులువుగా గుర్తించేందుకు వీలుగా ఈ కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆయన ఆదేశించారు. కౌంటర్ల వద్ద అవసరమైన ఎల్ఈడీ లైటింగ్, బ్రాడ్ కాస్టింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. కౌంటర్లలో పాదరక్షలు భద్రపరుచుకునేందుకు వినియోగించే సంచులను కొనుగోలు చేయాలని మార్కెటింగ్ విభాగం అధికారులకు సూచించారు. భక్తులకు సేవలు అందించేందుకు తగినంత మంది శ్రీవారి సేవకులను అందుబాటులో ఉంచాలని పీఆర్వోను ఆదేశించారు.