అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandra Babu) దేవుళ్లను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) ఆరోపించారు. వంద రోజుల పాలనపై ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి తిరుమల లడ్డూ (Tirumala Laddu) తయారిలో కల్తీ నెయ్యి అంటూ కట్టుకథ అల్లారని దుయ్యబట్టారు. గత రెండు రోజులుగా తిరుమల లడ్డూ కల్తీపై వస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు.
శుక్రవారం తాడేపల్లి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భక్తుల మనోభావాలతో ఆడుకోవడం ధర్మమేమేనా అంటూ ప్రశ్నించారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని సుప్రీంకోర్టుకు , ప్రధానికి లేఖ రాస్తానని వెల్లడించారు. అన్ని నియమ నిబంధనలు, మూడుసార్లు టెస్టింగ్‌ల తరువాతే వచ్చే రిపోర్టు అనంతరం నెయ్యి లడ్డూ తయారికి వెళ్తుందని అన్నారు. గత టీడీపీ, వైసీపీ హయాంలో నెయ్యి ప్రమాణాలు లేవని టీడీపీ 16 సార్లు, వైసీపీ 18 సార్లు ట్యాంకర్లను తిరిగి పంపించిందని గుర్తు చేశారు.
కల్తీ జరిగిందని తప్పుడు ప్రచారంతో దారుణ అబద్దాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీల నుంచి , ప్రజల నిలదీతల నుంచి దృష్టిని మరల్చడానికి ఈ నాటకం వాడుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి భక్తుల మనోభావాలు, టీటీడీ ఆలయ పవిత్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
వైవీ సుబ్బారెడ్డి గొప్ప భక్తుడు ..
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తిరుమలలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. ల్యాబ్‌లను మెరుగుపర్చామన్నారు. బోర్డు తీసుకున్న నిర్ణయాల్లో ప్రభుత్వ ప్రమేయం ఉండదని అన్నారు. వైవీ సుబ్బారెడ్డి 45 సార్లు అయ్యప్పమాల వేసుకున్నగొప్ప భక్తుడని కొనియాడారు. తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్న చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రిగా కావడం ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యమని అన్నారు .