తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. వీరికి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 68,995 మంది భక్తులు దర్శించుకోగా 29,037 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.71 కోట్లు వచ్చిందని తెలిపారు.
టీటీడీ విశ్రాంత ఉద్యోగులకు శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదం
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల అనంతరం టీటీడీ విశ్రాంత ఉద్యోగులకు, కుటుంబ పింఛన్‌దార్లకు అందించే శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదాన్ని నవంబర్ 4 నుంచి 10వ తేదీ వరకు అందించనున్నారు. తిరుపతిలోని టీటీడీ క్యాంటీన్ వద్ద గల కొత్త జాబిలి భవనంలో ఉదయం 10.30 గంటల నుంచి ప్రసాదాలు పంపిణీ చేస్తారని, పింఛన్‌దార్లకు ఒక పెద్ద లడ్డూ, ఒక వడ, పీపీఓ నంబర్ల వారీగా ప్రసాదాల పంపిణీ జరుగుతుందన్నారు.