అనకాపల్లి : జిల్లాలో పులి సంచారం జాడలను అటవీ అధికారులు కనిపెట్టారు. దాంతో ఇక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నెల రోజుల క్రితం కోటవురట్ల మండలంలో కనిపించి కంటిపై నిద్ర కరవు చేసిన పులి.. ఇప్పుడు సబ్బవరం మండలంలో తిరుగుతూ ప్రజల్ని కలవరపెడుతున్నది. అటవీ అధికారులు రంగంలోకి దిగి పులిని పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
అనకాపల్లి జిల్లాలో పులి కనిపించడంతో ఇక్కడి ప్రజలు కంటి మీద కునుకు కరవయ్యారు. సబ్బవరం మండలం పరిధిలోని నల్లరేగులపాలెంలో మూడు రోజుల నుంచి పశువులపై దాడి చేస్తున్నట్లుగా గుర్తించారు. విజయ రామసాగరం సమీపంలో గేదెను చంపింది. మేతకు వెళ్లిన మరో రెండు ఆవులు తిరిగి రానట్లు స్థానికులు గుర్తించారు. దాంతో అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు రంగంలోకి దిగారు. నల్లరేగుల పాలెం సమీపంలో పెద్దపులి అడుగు జాడలను గుర్తించారు. ఉన్నతాధికారుల సూచన మేరకు రెండు సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి పులి కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
పులి జాడలు కనిపించడంతో సబ్బవరం మండల ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. గేదెలపై దాడికి పాల్పడుతున్నది పులిగా గుర్తించినట్లు చెప్పడంతో ఎప్పుడు ఎక్కడి నుంచి దాడి చేస్తుందో అని ఇక్కడి ప్రజలు భయపడుతున్నారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. గేదెలను తోలుకువెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. నెల రోజుల క్రితం కోటపాడు మండలం చౌడువాడలో పులి జాడలను గుర్తించారు. ఆ తర్వాత కోటవురట్ల మండలం పరిధిలోని టీ జగ్గంపేట శివారు తాడిపత్రి-శ్రీరాంపురం గ్రామాల సమీపంలోని జీడిమామిడి తోటలో పులి జాడలు కనపించి భయపెట్టాయి.