అమరావతి: తనపై ఆరోపణలు చేసేది కేవలం చంద్రబాబు స్కూల్ స్టూడెంట్సే అని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చమత్కరించారు. తనను విమర్శిస్తున్న వీరేమీ జస్టిస్ చౌదరులు కాదని అన్నారు. తనను విలన్ అన్న వారు హీరోలా? అని నిలదీశారు. యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు నిన్న చేసిన విమర్శలకు వల్లభవనేని ఘాటుగా సమాధానమిచ్చారు. తనను ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నది గన్నవరం నియోజకవర్గం ప్రజలు అని, ఎవరికైనా ఏవైనా ఇబ్బందులు ఉంటే పార్టీ నాయకత్వానికి చెప్పుకోవాలని సూచించారు.
తనను ఎదుర్కోవడం చేతగాక పోవడం వల్లనే నోటికొచ్చినట్లుగా ఆరోపణలు చేస్తున్నారని వల్లభనేని వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కారణంగా వారు బాధ పడుతున్నట్లయితే ముఖ్యమంత్రి జగన్ను కలిసి చెప్పుకోవచ్చని, వారిని తామేమీ అడ్డుకోవడం లేదన్నారు. తాను ఎమ్మెల్యేనని, తనకే పార్టీ బాధ్యతలను అప్పగించిందన్న విషయాన్ని వంశీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. పార్టీకి పనికొచ్చే ఎలాంటి పని చేయకుండా హడావుడి చేయడం వీరికి పరిపాటిగా మారిందన్నారు. మొత్తమ్మీద గన్నవరం వైసీపీలో నేతల మధ్య విభేదాలు రోడ్డున పడటంతో కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.