అమరావతి : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ( Nirmala Sitharaman) ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన కేటాయింపులపై ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు స్పందించారు. శనివారం పార్లమెంట్లో బడ్జెట్ అనంతరం ఏపీకి దక్కిన నిధులపై కేంద్ర విమానాయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu), కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandra Shekar) ఢిల్లీలో మీడియా సమావేశంలో వివరించారు.
కేంద్రంలో కీలక భాగస్వామ్యంగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభావం బడ్జెట్‌పై ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో జల్‌జీవన్ మిషన్‌ను (Jaljeevan Mission) గడువును 2028 వరకు పొడగించడం అభినందనీయమన్నారు. ఉడాన్ స్కీంలో రాష్ట్రానికి మేలు జరుగనుందని వివరించారు. సివిల్ ఏవియోషన్ రంగంలో శరవేగంగా అభివృద్ధి చేసేందుకు నిర్ణయం తీసుకోవడం హర్షనీయమని అన్నారు. మాన్యుఫాక్చరింగ్ రంగంలో మేలు జరుగనుందని తెలిపారు.
కేంద్ర బడ్జెట్లో సింహభాగం ఆంధ్రప్రదేశ్‌కు దక్కుతుందని, పోలవరం, రాజధాని అమరావతికి నిధులు కేటాయించారని తెలిపారు . ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను పూర్తిగా అవగాహన చేసుకుని రాష్ట్రానికి మరిన్ని నిధుల కోసం టీడీపీ, జనసేన, బీజేపీ ఎంపీలు ఉమ్మడిగా పనిచేస్తామని అన్నారు. ఇప్పటికే పోలవరానికి నిధులు, అమరావతికి రూ.15 వేల కోట్లు, హడ్కో నుంచి మరో రూ.16 వేల కోట్లు , విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ప్యాకేజీ ఇచ్చారని గుర్తు చేశారు.