Vizag Central Jail | వైజాగ్ సెంట్రల్ జైల్లో మరోసారి మొబైల్ ఫోన్లు దొరకడం కలకలం రేపింది. నర్మదా బ్లాక్‌లో శుక్రవారం మరో మొబైల్‌ను అధికారులు గుర్తించారు. సిమ్ కార్డు లేని మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. సూపరింటెండెంట్ మహేశ్‌బాబు నేతృత్వరంలో సెంట్రల్ జైలులో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
రెండు రోజుల క్రితం విశాఖ సెంట్రల్ జైలులో రెగ్యులర్ తనిఖీలు చేపట్టగా.. పెన్నా బ్యారక్ సమీపంలో పోలీసులకు నాలుగు అడుగుల లోతులో పాతిపెట్టిన ఓ ప్యాకెట్ కనిపించింది. పెన్నా బ్యారక్ సమీపంలోని పూల కుండీల వద్ద భూమిలో 4 అడుగుల లోతులో ఈ ఫోన్లను కవర్లో పెట్టి పాతిపెట్టారు. వాటిపై రెండు రాళ్లు కప్పి పైన పూల కుండీని పెట్టారు. అనుమానాస్పదంగా కనిపించడంతో దాన్ని పరిశీలించగా అందులో రెండు సెల్ఫోన్లు, ఒక పవర్ బ్యాంక్, రెండు చార్జింగ్ వైర్లు, ఫోన్ బ్యాటరీ కనిపించాయి.
సెల్ఫోన్లు దొరకడంతో పోలీసులు అప్రమత్తమై వాటిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ సెల్ఫోన్లలో సిమ్ కార్డులు లేకపోవడం పలు అనుమానాలను రేకెత్తించింది. రెండు మొబైల్ ఫోన్లు దొరికిన నేపథ్యంలో శుక్రవారం నాడు మరోసారి క్షుణ్నంగా తనిఖీలు చేపట్టగా నర్మదా బ్లాక్‌లో మరో మొబైల్ దొరికింది. ఇప్పటివరకు విశాఖ సెంట్రల్ జైలులో మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.